Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీ జేఎన్ వర్సిటీ వీసీగా తెలుగు వ్యక్తి నియామకానికి రాష్ట్రపతి ఆమోదం

ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్ యూ) ఉప కులపతిగా తెలుగు వ్యక్తి, ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు వర్సిటీ వీసీ పదవికి ఆయన పేరును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. ప్రస్తుతం ఐఐటీ ఢిల్లీలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఆచార్యునిగా జగదీశ్ పని చేస్తున్నారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ జిల్లా మామిడాల గ్రామం. జగదీశ్ తో పాటు ప్రొఫెసర్లు వీఎస్ చౌహాన్, ఆర్ఎన్ కే బమేజాయి, రామకృష్ణ రామసామిల పేర్లను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ రాష్ట్రపతికి పంపింది. చివరగా జగదీశ్ పేరుకే రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే, ఆ మధ్య ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొనటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై ఆయన స్పందిస్తూ, తానొక విద్యావేత్తనని, ఏ సంస్థతోనూ తనకు సంబంధం లేదని చెప్పారు. ఐఐటీ ఢిల్లీలో సైన్సు అంశంపై జరిగిన కార్యక్రమానికి మాత్రమే తాను హాజరయ్యానన్నారు. కాగా ప్రస్తుత జేఎన్ యూ వీసీ ప్రొఫెసర్ సుధీర్ కుమార్ సొపోరీ పదవీకాలం ఈ నెల 27తో ముగియనుంది.

More Telugu News